ఆలేరు ధాన్యం కొనుగోళ్లు, NewzFast Telugu (ఆలేరు, యాదాద్రిభువనగిరి జిల్లా): యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను రైతులు నిలదీశారు. బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బీఆర్‌ఎస్ హయాంలో ఆలేరులో రూ.275 లక్షలతో నిర్మించిన గోదామును ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా రైతులు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న ఆలస్యాన్ని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. అన్నం తిందామంటూ ఎమ్మెల్యే బుజ్జగించగా, తామే పది మందికి అన్నం పెడతామంటూ రైతులు సమాధానం ఇవ్వడంతో ఆయన విస్తుపోయారు.
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన రైతు చౌడబోయిన సంజీవులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డుల్లో గత 20 రోజులుగా ధాన్యాన్ని ఉదయం ఎండబెట్టి, సాయంత్రం కుప్పపోసి ప్లాస్టిక్ కవర్ కప్పి ఇంటికి వెళ్లి వస్తున్నామని తెలిపారు. కనీసం తేమ చూడటానికి సూపర్‌వైజర్ కూడా రావడం లేదని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆవేదనపై స్పందించిన బీర్ల అయిలయ్య, రేపటి నుంచి మార్కెట్‌లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడించారు.




