అఖిల భారత కిసాన్ సభ, NewzFast Telugu (జనగామ): ఈనెల 15 నుంచి 18 తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు.
బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సంఘాల సమావేశం శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు బచ్చు శ్రీలత అధ్యక్షత వహించగా, సోమయ్య పాల్గొని మాట్లాడారు.
రైతాంగ హక్కుల సాధన, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాడుతోందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన చారిత్రక రైతు ఉద్యమంలో ఈ సంఘం కీలకపాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని, కరువు ప్రాంతాల్లో పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు లేకుండా దిగుమతికి అవకాశం ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ రైతులను దెబ్బతీస్తోందని సోమయ్య పేర్కొన్నారు. సాదా బైనామా భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, కౌలు రైతులను గుర్తించాలని ఆయన కోరారు.
ఈనెల 15న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




