ఏఐ పోలీస్ స్టేషన్, NewzFast Telugu (హైదరాబాద్): దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటోందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు, పైలట్ ప్రాజెక్టు కింద ఈ స్టేషన్‌లోని అన్ని సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సీపీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఠాణా సిబ్బంది పనితీరును, ఏఐ సాంకేతిక ఏర్పాట్లను ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ ఏఐ పోలీస్ స్టేషన్‌లో డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ చేతుల మీదుగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఇక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు.
స్టేషన్ రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన ‘సేతు’ (Setu) కియోస్క్ ద్వారా బాధితులు 10 భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఏఐ సాంకేతికత వాటిని క్షణాల్లో స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు చేరవేస్తుంది.
దర్యాప్తు ప్రక్రియ మొత్తం ఏఐ ఆధారంగానే వేగంగా జరగనుంది. ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు మొదలుకుని కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ రూపకల్పన వరకు ప్రతి దశ ఏఐ సహాయంతో కొనసాగుతుంది.
పంజాగుట్ట పరిధిలోని రద్దీ ప్రాంతాలు, హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు, పాత నేరాల చరిత్రను ఏఐ విశ్లేషిస్తుంది. దీని ఆధారంగా బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల గస్తీని మరింత సమర్థంగా నిర్వహిస్తారు.
ఈ నూతన సాంకేతికత వినియోగంపై పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు.




