అగ్గు ఎర్రన్న మరణం, NewzFast Telugu (మోపాల్): మోపాల్ మండల కేంద్రానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గు ఎర్రన్న అకాల మరణం అత్యంత బాధాకరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.
భూపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ఎర్రన్న మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం వెంటనే వారి నివాసానికి వెళ్లారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ఎర్రన్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు.
ఆయన మరణానంతరం శరీరాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం ఆసుపత్రికి అందించడం గొప్ప విషయమని, ఇది ఎంతోమందికి ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మోపాల్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రవి, కమ్యూనిస్ట్ నాయకులు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

