బ్యాలెట్ ఎన్నికలు , NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్తే తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమైతే తాను, తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓడిపోయిన ప్రతిసారీ ఈవీఎంలపైనా కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఈవీఎంలతో తొలిసారి ఎన్నికలకు వెళ్లిందే రాజీవ్ గాంధీ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రస్తావించారు. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని, అస్సాంలో బ్యాలెట్‌తో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన 28 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.







