కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ, NewzFast Telugu: ప్రముఖ జానపద కవి, కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సాహిత్య సంపుటాలు అమెరికాలోని డాలస్లో ఘనంగా ఆవిష్కృతమయ్యాయి. తానా ప్రపంచసాహిత్యవేదిక, కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సహకారంతో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.
కొసరాజు సర్వలభ్య రచనలను సంకలనం చేసి గత ఏడాది గుంటూరులో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఇప్పుడు ఆ సంపుటాలను అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేశారు.
డా. ప్రసాద్ తోటకూర సభాధ్యక్షత వహించగా, డా.
నల్లూరి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని సాహిత్య సంపుటాలను ఆవిష్కరించారు. కొసరాజు కవితలు, శతకాలు, కావ్యాలు, సినీ గీతాలు ప్రత్యేక శైలిలో సాగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
‘గండికోట యుద్ధం’, ‘కడగండ్లు’, ‘కొసరాజు విసుర్లు’, ‘కొండవీటి వైభవం’, ‘నవభారతం’, ‘భానుగీత’ వంటి రచనలు ఆయన సాహితీ వైవిధ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రచనల్లోని పద సంపదను భావితరాలకు అందించేందుకు కొసరాజు పద నిఘంటువు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
‘కొసరాజు సినీవ్యాస సంహిత’ రచయిత చంద్రహాస్ మద్దుకూరి విశిష్ట అతిథిగా మాట్లాడారు. సినీ గీతాల్లో కొసరాజు ఉపయోగించిన అచ్చతెలుగు పదాలు, గ్రామీణ మాటలు సరళంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో అనంతరం నిర్వహించిన కొసరాజు పాటల సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. స్థానిక గాయనీగాయకులు ‘నిలువవే వాలు కనులదానా’, ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’, ‘సై సై జోడెడ్లాబండీ’ వంటి ప్రసిద్ధ గీతాలను ఆలపించారు.
సాయి నృత్య అకాడమీ నాట్యగురువు యడ్లపాటి శ్రీదేవి నిర్వహణలో విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంపుటాల ముద్రణకు సహకరించినవారిని, పాల్గొన్న కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

