ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, NewzFast Telugu: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల్లో నమోదైన బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఇందులో భాగంగా మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను వేరు చేస్తారు.
ఎంపీటీసీ ఓటింగ్‌కు ఉపయోగించిన పింక్ రంగు పత్రాలు, జెడ్పీటీసీ ఎన్నికల వైట్ రంగు పత్రాలను ప్రత్యేకంగా గుర్తించి వర్గీకరిస్తారు. అనంతరం పత్రాలపై ఉన్న మడతలను విప్పకుండా 25 చొప్పున కట్టలు కడతారు.
ఈ కట్టలను డ్రమ్ములో వేసి కలుపుతారు. దీనివల్ల బ్యాలెట్ పత్రాలు ఒకే క్రమంలో కాకుండా మిశ్రమంగా ఉంటాయి.
ఆ తర్వాత కౌంటింగ్ టేబుళ్లకు విడతల వారీగా పత్రాలను అందజేస్తారు. ప్రతి విడతలో ఒక్కో టేబుల్‌కు 25 పత్రాల చొప్పున మొత్తం 40 కట్టలుగా అందించే విధానం ఉంటుంది.
ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పత్రాలను తెరిచి ఓట్లను పరిశీలించి అభ్యర్థుల వారీగా వర్గీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్లను నిబంధనల ప్రకారం గుర్తించి లెక్కిస్తారు.
ఒక ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితం అధికారికంగా ప్రకటించిన తర్వాతే తదుపరి స్థానం కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ విధానంతో ప్రతి నియోజకవర్గ ఫలితం విడివిడిగా, స్పష్టంగా వెల్లడవుతుంది.

