ఏపీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు, NewzFast Telugu: ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
365 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల అధికారులు బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
గురువారం జరిగిన పోలింగ్లో 2,61,52,377 మంది ఓటర్లలో దాదాపు 1.85 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 70.72 శాతం పోలింగ్ నమోదైంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు 39,694 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. కేంద్రాల వద్ద 40,679 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
లోపల, బయట సీసీటీవీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంచారు.
ఏకగ్రీవాలు పోను ఎంపీటీసీ స్థానాల్లో 18,844 మంది, జడ్పీటీసీ స్థానాల్లో 2,169 మంది అభ్యర్థులు పోటీ చేశారు. జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 574, టీడీపీ 452, జనసేన 109, బీజేపీ 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

