కారేపల్లి పశువుల సంత వేలం, NewzFast Telugu (ఖమ్మం జిల్లా, కారేపల్లి): కారేపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధీనంలో ప్రతి ఆదివారం నిర్వహించే పశువుల సంత లైసెన్సు హక్కుల కోసం గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు.
సంత ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో వేలం ప్రక్రియ చేపట్టారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆరుగురు వ్యక్తులు నిర్ణీత డిపాజిట్ మొత్తాన్ని చెల్లించి పోటీలో నిలిచారు.
వేలంలో పోటాపోటీగా ధరలు పెరిగాయి. చివరకు నార్కెట్పల్లికి చెందిన దూదిమెట్ల వెంకటేశ్వర్లు అత్యధికంగా రూ.8 లక్షల 6 వేలకు పాట పాడి పశువుల సంత నిర్వహణ హక్కులను దక్కించుకున్నారు.
కారేపల్లిలో ప్రతి ఆదివారం జరిగే పశువుల సంతకు పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి రైతులు, పశువుల కొనుగోలుదారులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో లైసెన్సు వేలం ఆసక్తికరంగా సాగింది.
దేవస్థానానికి ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి కొండకింది వేణుగోపాల చారి, ఇన్స్పెక్టర్ సమత, సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ), పంచాయతీ కార్యదర్శి నెహ్రూ, అర్చకుడు దంతోజు వినయ్, దేవస్థాన సిబ్బంది మూడు మోహన్ పాల్గొన్నారు.
