విశాఖ మేయర్ ఎన్నిక ఫలితాలపై వరుదు కల్యాణి స్పందన, NewzFast Telugu (విశాఖపట్నం): విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఈ ఓటమి అనంతరం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి స్పందించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తమకు ఓటు వేసిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నూతన మేయర్గా ఎన్నికైన కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణికి ఆమె అభినందనలు తెలియజేశారు.
అధికారం, డబ్బు, మూడు పార్టీల కూటమి బలాన్ని తట్టుకుని వైసీపీ శ్రేణులు వీరోచితంగా పోరాడాయని ఆమె కొనియాడారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, విశాఖ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు.
తమపై నమ్మకంతో ఓటేసిన సుమారు 3.40 లక్షల మంది ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నూతన పాలకవర్గానికి ఆమె కీలక సూచన చేశారు. విశాఖ ప్రజల కష్టార్జితమైన రూ.1,700 కోట్ల జీవీఎంసీ నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ, ఆ నిధులను తిరిగి జీవీఎంసీకి రప్పించి నగరంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. 2029 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యమని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
