Citibank Florida shooting, NewzFast Telugu (Brandon, near Tampa, Florida): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న సిటీబ్యాంక్ ఆఫీసు క్యాంపస్‌లో కాల్పుల ఘటన జరిగింది. ఓ ఆగంతకుడు తన కారుతో క్యాంపస్‌లోకి దూసుకువచ్చాడు.
లంచ్ సమయంలో కారులో నుంచి ఏఆర్ స్టైల్ రైఫిల్ తీసి అతడు కాల్పులు జరిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళా ఉద్యోగి మృతిచెందింది.
సెక్యూరిటీ ఫెన్సింగ్‌ను కారుతో ఢీకొట్టిన దుండగుడు ఔట్‌డోర్ డైనింగ్ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చాడని తెలిసింది. ఈ సమయంలో భవనంలోని కేఫటేరియాలోకి ప్రవేశించిన అతడిని సిటీబ్యాంక్ సెక్యూరిటీ గార్డు కాల్చినట్లు సమాచారం.
ఇరువురి మధ్య గన్‌ఫైర్ జరిగిందని, గార్డు కాల్పులతో షూటర్ కిందపడిపోయాడని చెబుతున్నారు. అతడిని టంపా ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన అనంతరం వందలాది మంది పోలీసులు సిటీబ్యాంక్ సెంటర్‌కు చేరుకున్నారు. కాల్పుల సమయంలో భవనంలో సుమారు 3,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది.
మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని నివేదికలు తెలిపాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఉద్దేశం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.
