దేవరయాంజల్ భూ వ్యవహారం, NewzFast Telugu (శామీర్‌పేట, మేడ్చల్ జిల్లా): దేవరయాంజల్ భూ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని సర్వే నంబర్లు 682, 684, 685 పరిధిలో ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించి 1,220 ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు.
నకిలీ పట్టాల తయారీ, విక్రయాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించాలని, పంచాయతీ లేఅవుట్లలోని పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్‌ను వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
ఈ వ్యవహారంలో బాధ్యులు ఎవరు, ప్రభుత్వ భూములు మరియు పార్కు స్థలాల ఆక్రమణల వెనుక ఎవరున్నారు, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.

