సదర్ వేడుకలు తెలంగాణ రాష్ట్ర పండుగ, NewzFast Telugu (హైదరాబాద్): సదర్ వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి రూ.5 కోట్లు కేటాయించిందని తెలిపారు.
ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం, శ్రీకృష్ణుడికి, పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన దున్నపోతులకు పూజలు చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు.
యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కులగణన నిర్వహించి, జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు వాటా కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి యాదవులు సహకరించాలని ఆయన కోరారు.
యాదగిరి గుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పశుసంపద అభివృద్ధితోనే వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. సదర్ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఏటా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, యాదవ సమాజం అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడతామని స్పష్టం చేశారు.
దున్నపోతుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, బోనాలు, గిరిజన నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి యాదవ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
