ఆర్బీఐ టెక్నికల్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, NewzFast Telugu: ఆర్థిక మార్కెట్లలో కీలక విధాన, కార్యాచరణ అంశాలపై దృష్టి సారించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బుధవారం సాంకేతిక సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ అధ్యక్షత వహిస్తారు.
నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ మారక మార్కెట్లు, డెరివేటివ్ ఒప్పందాల మార్కెట్లు, మౌలిక సదుపాయాల విధాన, కార్యాచరణ అంశాలపై మార్కెట్ భాగస్వాములు, ఇతర వర్గాలతో ఆర్బీఐ క్రమబద్ధంగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కమిటీ వేదికగా పనిచేస్తుంది. ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్, రిపోర్టింగ్ వంటి అంశాలతో పాటు ఇతర మార్కెట్ మౌలిక సదుపాయాలను కూడా ఇది పరిశీలిస్తుంది.
ఆర్బీఐ చర్యల అమలు, మార్కెట్లలో అనుకోకుండా ఏర్పడే ఆటంకాల గుర్తింపు, కొత్త విధాన సమస్యలపై కూడా కమిటీ దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు, ఆర్థిక రంగ ఆవిష్కరణలు, భారత ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే కొత్త ముప్పులను కూడా ఇది పర్యవేక్షిస్తుంది.
కమిటీ సమావేశాలను ప్రతి త్రైమాసికంలో కనీసం ఒకసారి నిర్వహిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఈ కమిటీలో సెబీ మాజీ పూర్తికాల సభ్యుడు అనంత్ నారాయణ్, యాక్సిస్ బ్యాంక్ ఈడీ నీరజ్ గంభీర్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటీబ్యాంక్ ప్రతినిధులు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు.


