జీవో 134 అమలుపై హైకోర్టు స్టే, NewzFast Telugu: సికింద్రాబాద్లోని బోయిగూడలో 1,936 చదరపు గజాల స్థలం విషయంలో మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 134 అమలుపై హైకోర్టు బుధవారం స్టే విధించింది.
స్టీఫెన్సన్ తరఫున న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిటిషనర్ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆయన పేర్కొన్నారు.
సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో స్టీఫెన్సన్ ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం జీవో 134 అమలును నిలిపివేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఉత్తర్వులు కేవలం స్టీఫెన్సన్ ఆస్తికి మాత్రమే వర్తిస్తాయని, అదే జీవో పరిధిలోని ఇతర ఆస్తులకు వర్తించబోవని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.
