BRS demands withdrawal of GO 14 on BC rights, NewzFast Telugu (Hyderabad): బీసీల న్యాయమైన హక్కుల సాధన, ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 14ను గుట్టుగా తీసుకువచ్చి బీసీల హక్కులను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవో బీసీ కులాల స్వేచ్ఛకు భంగం కలిగించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కోట్ల విలువైన 82 ఎకరాల భూమిని కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ఆ భూములపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదనే ఉద్దేశంతో కుల సంఘాలతో ట్రస్టులు ఏర్పాటు చేశారని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములు, కుల సంఘాలు, ఆత్మగౌరవ భవనాలపై పెత్తనం చెలాయించేందుకు జీవో 14 తీసుకువచ్చిందని రవిచంద్ర విమర్శించారు. జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
