అటవీ భూముల సంరక్షణ, NewzFast Telugu (సిరిసిల్ల): అటవీ భూములను అటవీ శాఖ అధికారులు సంరక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేష్ బీ గితే, జిల్లా అటవీ శాఖ అధికారి సత్య నారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అటవీ, పోలీస్, రెవెన్యూ, నీటి పారుదల, మత్స్య, వ్యవసాయ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నియామకం, అటవీ భూముల ఆక్రమణలపై చర్యలు, భూముల సరిహద్దుల గుర్తింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.
అటవీ, రెవెన్యూ రికార్డులు, పట్టా భూములు, ప్రభుత్వ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సరిహద్దులు పరిశీలించి జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
భూములు ఆక్రమించే వారిపై, జంతువులను వేటాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ భూముల్లో మొక్కలు నాటాలని కూడా సూచించారు.
జిల్లాలో మొత్తం 157 చెరువులు (వెట్‌ల్యాండ్స్) గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీటి హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌ను సర్వే చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలని, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ చెరువులు భూగర్భ జలాల పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు, వలస మరియు స్థానిక పక్షులు, జంతువులకు ఆవాసంగా ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడతాయని చెప్పారు.
అటవీ భూముల్లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మహేష్ బీ గితే సూచించారు. భూముల ఆక్రమణలపై అటవీ శాఖతో కలిసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

