ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం, NewzFast Telugu (సిరిసిల్ల): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో విచారణను వేగంగా పూర్తి చేసి చార్జిషీట్ వేస్తే బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటివరకు అట్రాసిటీ కేసుల కింద రూ.కోటి 81 లక్షల 57 వేల 500 పరిహారం అందించినట్లు వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ పథకాల ప్రయోజనాలు అర్హులకు అందేలా చూడాలని, వారి సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నెలా చివరి రోజున మండలాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
రెసిడెన్షియల్ విద్యాలయాలు, ఉపకార వేతనం, విదేశీ విద్య, సబ్సిడీ, ఉపాధి పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కొనసాగుతోందని తెలిపారు.
ఎస్పీ మహేష్ బీ గితే మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విచారణ వేగంగా పూర్తి చేస్తున్నామని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో, ఆర్డీవోలు, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
