ఓయూ బోధనేతర సిబ్బంది సమ్మె, NewzFast Telugu (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న బోధనేతర సిబ్బంది తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు.
ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ఓపీఎస్ అమలు, సర్వీసుల క్రమబద్ధీకరణ, హెల్త్ కేర్ బెనిఫిట్స్ వంటి డిమాండ్లతో నాన్ టీచింగ్, టెక్నికల్, టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఈ శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ, సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం లేకపోవడం వర్సిటీ పరిపాలన వైఫల్యమని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చినప్పటికీ అమలు జరగడం లేదని ఆయన అన్నారు.
టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, 2001 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. 2004 తర్వాతి వారికి సీపీఎస్ అమలు చేయాలని, ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న అంతర్గత పదోన్నతులు, నోటిఫికేషన్లను భర్తీ చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు వెంటనే జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని ఆయన కోరారు.
లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
