ఎన్నికల కమిషనర్ల చట్టం సెక్షన్ 16 సుప్రీంకోర్టు విచారణ, NewzFast Telugu: ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023లోని సెక్షన్ 16 రాజ్యాంగ బద్ధతపై భారత సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను స్వీకరించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనిపై స్పందించాలని కోరింది.
సెక్షన్ 16 ప్రకారం బాధ్యతల్లో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లు అధికారిక విధుల్లో చేసిన ఏ చర్యపైనా సివిల్, క్రిమినల్ న్యాయస్థానాల్లో విచారణ జరపడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్-14లో పేర్కొన్న చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు.
రాష్ట్రపతులు, గవర్నర్లు, న్యాయమూర్తులకు పరిమిత రక్షణలు మాత్రమే ఉంటాయని, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. వ్యవస్థాగత స్వతంత్రత పేరుతో ఇంతటి రక్షణ ఇవ్వడం జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

