ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి, NewzFast Telugu (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): రూ. 10 చిల్లర విషయంలో జరిగిన చిన్న గొడవ ఒక యువతి ప్రాణాలను బలిగొంది. 24 ఏళ్ల ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక ఈ ఘటనలో మృతి చెందారు.
మణుగూరు డిపో పరిధిలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవళికకు గత నెల 25వ తేదీన అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో బస్సులో ప్రయాణికురాలితో టికెట్, చిల్లర చెల్లింపుల విషయంలో వాగ్వాదం జరిగింది. ఘర్షణ ముదరడంతో ప్రయాణికురాలు ఆమెను బస్సు నుంచి కిందకు తోసేసింది.
ఆ సమయంలో బస్సు చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొలుత సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రవళిక మృతిపట్ల ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.
ఈ ఘటనకు కారణమైన మహిళా ప్రయాణికురాలిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, ఆర్టీసీ సిబ్బందిపై ఫిర్యాదులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

