మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వివాదం, NewzFast Telugu: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
జాతీయ మీడియాలో కూడా ఈ కథనాలు రావడంతో టిపిసిసి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు (గురువారం) ఇరువురిని పిసిసి కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం.
ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఢిల్లీలోని ఒక హోటల్లో మంత్రి తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని, దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లక్ష్మీకాంతరావు ఆరోపించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అభివృద్ధి పనులు, నామినేటెడ్ పదవులు, పార్టీ వ్యవహారాల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇరువురితో విడివిడిగా చర్చించడంతో పాటు, వీలైతే ఒకే వేదికపై కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
