మహిళల అక్షరాస్యత, NewzFast Telugu (పాన్‌గల్, నాగర్‌కర్నూల్ జిల్లా): మహిళల ఆర్థిక స్వావలంబనకు అక్షరజ్ఞానం పునాది అని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్‌గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళలు అక్షరాస్యులైతే ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. కుటుంబం, సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు విద్యావంతులు కావాలని అన్నారు.
ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
గ్రామంలో నిరక్షరాస్య మహిళలకు మంత్రి పలకలు, బలపాలు పంపిణీ చేశారు. వీటి కొనుగోలుకు గతంలోనే రూ.10 వేల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని సూచించారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట చొప్పున మహిళలకు చదువు నేర్పేందుకు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్ జంబలయ్యకు సూచించారు. ఇందుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
మహిళల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు, చదవడం, రాయడం ముందుగా నేర్చుకునే మహిళకు రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్ రావు, ఎంపీడీవో గోవిందరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
