మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల బకాయి జీతాల నిరసన, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు బకాయి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెరుపు ధర్నా చేపట్టారు.
గత 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు లక్డీకాపూల్ బీఎస్ఎన్ఎల్ భవన్ నుంచి సచివాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు.
సచివాలయ సౌత్-ఈస్ట్ గేటు ముందు బైఠాయించిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు ఆరోపించారు.
ఈ ఆందోళనతో ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడగా, పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. బకాయి జీతాల సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు తెలిపారు.

