తెలంగాణ ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ పథకం, NewzFast Telugu (తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన ఈ పథకానికి దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పారదర్శక పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర సామాజిక, ఆర్థిక రంగాలకు కొత్త మోడల్‌గా నిలుస్తోందని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సుమారు 14 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టుపని ద్వారా నిరంతర ఉపాధి లభిస్తోంది. ప్రాథమికంగా 14 వేల మంది మహిళా టైలర్లకు నేరుగా యూనిఫాం కుట్టు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత యూనిఫామ్‌లు సకాలంలో అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిందని పేర్కొన్నారు.
గతంలో యూనిఫాంలు, బూట్లు, పుస్తకాల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగేదని, కొన్ని సంవత్సరాల్లో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చింది.
సంక్షేమ శాఖలకు ఒకే గొడుగు కింద పారదర్శక కొనుగోళ్లు జరిపి, పాఠశాలలు తెరిచిన తొలిరోజే సంపూర్ణ కిట్లు అందించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో బహిరంగ ఈ-టెండర్ల ద్వారా క్లాత్ సేకరించి, కుట్టు కూలి నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లోకి జమ అయ్యేలా నిబంధనలు రూపొందించారు.
ఈ నిర్ణయం ద్వారా 56 లక్షల మీటర్ల యూనిఫాం క్లాత్, 6.49 లక్షల దుప్పట్లు, 3 లక్షల బెడ్షీట్లు, 2.29 లక్షల కార్పెట్ల ఆర్డర్లను స్థానిక చేనేత సహకార సంఘాలకు ఇచ్చినట్లు తెలిపారు. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల తయారీ బాధ్యతను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు కేటాయించారు.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా యూనిఫామ్‌లు లభించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజే యూనిఫాంలు, పుస్తకాలు, కిట్లు అందించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

