చేనేత వస్త్ర ప్రదర్శన 2026, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ హాలులో 9 రోజుల హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన 2026 శనివారం ప్రారంభమైంది. నగర సోషలైట్ బినా మెహతా ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె హాలులో ఉంచిన చేనేత వస్త్రోత్పత్తులను తిలకించారు. చేనేతకారులతో కలిసి తిరుగుతూ వాటి తయారీ విధానం, ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు.
భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్రాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ఆమె అన్నారు.
ఈ ఉత్పత్తులకు నేటికీ ఆదరణ తగ్గలేదని, నేటి యువత కూడా హ్యాండ్లూమ్ వస్త్రాలను ఇష్టపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. చేనేతకారులను ప్రోత్సహించాలని ఆమె ప్రజలను కోరారు.
ప్రదర్శనలో ఏముంది
నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు, చేతి పని బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు. సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి సుమారు 75 వేల రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు.




