SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఫామ్ 6, NewzFast Telugu: ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోతే గతంలో నమోదైన ఓటర్లు మళ్లీ నమోదు కావడానికి ఫామ్ 6ను సమర్పించవచ్చని భారత ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ స్పష్టీకరణ వెలువడింది.
ఫామ్ 6ను సమర్పించడం అంటే తాను మొదటిసారిగా ఓటర్ల జాబితాలో చేరాలని కోరుకుంటున్నట్టు డిక్లరేషన్ ఇవ్వడమేనని ఈసీ వివరించింది. ఒకవేళ ఆ డిక్లరేషన్ అబద్ధమైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద విచారణ లేదా చర్యలకు దారితీయవచ్చని హెచ్చరించింది.
ప్రస్తుతం జరుగుతున్న SIR ప్రక్రియలో ప్రచురించిన ముసాయిదా జాబితాలో పేర్లు లేని కొందరు ఫామ్ 6 సమర్పించేందుకు సంకోచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈసీ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ వివరణ ఇచ్చింది.
ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు, గతంలో నమోదు చేసుకున్నప్పటికీ, తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను కొత్తగా చేర్చడానికి ఫామ్ 6ను సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

