ఇరాన్‌పై అమెరికా దాడులు, హొర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, NewzFast Telugu: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది.
ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు వెల్లడించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే ఇవి పరిమిత స్థాయి సైనిక చర్యగా భావిస్తున్నారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం ఖేష్మ్, హెంగామ్ దీవులతోపాటు సమీపంలోని ప్రధాన భూభాగ ప్రాంతమైన బందర్ అబ్బాస్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. గతంలో జరిగిన దాడుల మాదిరిగా ఈసారి అమెరికా ముందుగా అధికారిక ప్రకటన చేయలేదు.
మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు దాడులు జరగడం ఆయన వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది.
ఇరాన్‌తో ఘర్షణలు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తన సైనిక సన్నద్ధతను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పారామిలిటరీ స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే ప్రణాళికను రూపొందించింది.
సోమవారం టెహ్రాన్‌లో మూడో సైనిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.
ఈ వారం నుంచే దేశవ్యాప్తంగా 1500 శిక్షణ కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తాయని బసీజ్ శిక్షణ విభాగం డిప్యూటీ అధిపతి అలీ కౌసారీ తెలిపారు.
మరోవైపు ఒమన్ తీరంలో భారత పతాకంతో వెళ్తున్న వాణిజ్య నౌకపై సోమవారం జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్టు ఒమన్ విదేశాంగ శాఖ తెలిపింది. నౌకలోని 14 మంది భారతీయుల్లో 13 మందిని ఒమన్ కోస్ట్‌గార్డు రక్షించింది.
ఈ దాడిలో గుజరాత్‌కు చెందిన గాంధార్ నహీమ్ అజిత్ మరణించినట్టు కేంద్ర మంత్రి శర్బనాద సోనావాల్ తెలిపారు. ఈ దాడిపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

