ఇరాన్ అణు విస్ఫోటన మార్గదర్శకాలు, NewzFast Telugu: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ ప్రభుత్వం తమ పౌరులకు అరుదైన హెచ్చరికను జారీ చేసింది. అణు దాడి లేదా అణు విస్ఫోటనం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో, ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు.
అధికారిక వార్తా సంస్థ IRNA సుమారు ఎనిమిది నిమిషాల నిడివిగల అవగాహన వీడియోను ప్రసారం చేసింది. ఇస్ఫాహన్ అత్యవసర సేవల విభాగం ఈ సూచనలను జారీ చేసింది.
ఇరాన్‌లోని భూగర్భ పికాక్స్ మౌంటెన్ అణు కేంద్రంపై అమెరికా దాడి చేయవచ్చన్న అంతర్జాతీయ ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహించే పాసివ్ డిఫెన్స్ వీక్‌లో భాగంగా చేపట్టినట్లు చెబుతున్నారు. సంక్షోభ పరిస్థితులకు పౌరులను సిద్ధం చేయడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.
మార్గదర్శకాల ప్రకారం, ధృడమైన భవనాల బేస్మెంట్లు లేదా కిటికీలు లేని మధ్య గదుల్లో ఆశ్రయం పొందాలి. బయటి గాలిని లోపలికి లాగే ఎయిర్ కండీషనర్లను వెంటనే ఆపివేయాలి.
పేలుడు కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా రేడియోధార్మిక రేణువులు గాలి ద్వారా వ్యాపించవచ్చని, అందువల్ల కనీసం 24 గంటల పాటు ఆశ్రయం నుంచి బయటకు రావద్దని సూచించారు.
కార్లు లేదా ఇతర వాహనాలు అణు ధూళి నుంచి రక్షణ ఇవ్వలేవని అధికారులు స్పష్టం చేశారు. ప్యాక్ చేసిన ఆహారం, బాటిల్ వాటర్ మాత్రమే తీసుకోవాలని సూచించారు.
బయట ఉన్నప్పుడు పేలుడు జరిగితే, దాని వైపు నేరుగా చూడకుండా నేలపై పడుకుని ముఖం, తలను రక్షించుకుని, వీలైనంత త్వరగా గట్టి భవనంలోకి చేరాలని వివరించారు.
రేడియోధార్మిక ధూళి బారిన పడ్డామన్న అనుమానం ఉంటే దుస్తులను జాగ్రత్తగా విప్పి సంచుల్లో సీల్ చేయాలని, బహిర్గతమైన చర్మం, వెంట్రుకలను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వైద్యుల సలహా లేకుండా అయోడిన్ మాత్రలు తీసుకోవద్దని హెచ్చరించారు.
సమాచార వ్యవస్థలు స్తంభిస్తే అత్యవసర అప్డేట్స్ కోసం బ్యాటరీతో పనిచేసే రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సూచించారు.

