మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ ఆరోపణలు, NewzFast Telugu (ఆర్మూర్): మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వమే పేల్చివేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతి వల్లే బ్యారేజీ దెబ్బతిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ప్రస్తుతం కూడా బ్యారేజీ ద్వారా 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఎస్సారెస్పీలో 90 టీఎంసీల నీటిని నింపి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలమయ్యేదని జీవన్ రెడ్డి అన్నారు. అలీసాగర్, నిజాంసాగర్, గుత్ప ప్రాజెక్టులు నిండితే వేలాది మంది రైతులకు ప్రయోజనం కలిగేదని చెప్పారు.
కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే పిల్లర్‌ను పేల్చే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తూ తెలంగాణ రైతుల భూములను ఎండబెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి పాలనలో వచ్చిన కరువని వ్యాఖ్యానించారు.
ఎస్సారెస్పీకి వెంటనే నీటిని విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు తిరగబడతారని, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
