ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి పాఠశాలల తనిఖీ, NewzFast Telugu (కొయ్యూరు): విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి సూచించారు. శుక్రవారం కొయ్యూరు మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంతో పాటు పలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మెనూపై ఆరా తీశారు. విద్యా విషయాలపై ప్రశ్నించి మరింత మెరుగ్గా బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
రికార్డులు, స్టోర్ రూంలను కూడా పరిశీలించారు.
స్టోర్ రూంలో వ్యత్యాసాలు, డిప్యూటీ వార్డెన్‌పై అసంతృప్తి
కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో స్టోర్ రూం స్టాక్‌లో వ్యత్యాసాలను గుర్తించిన చైర్మన్, దీనిపై డిప్యూటీ వార్డెన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులను విద్యా విషయాలపై ప్రశ్నించారు.
సమస్యలు చైర్మన్ దృష్టికి
కస్తూర్బా విద్యాలయంలో వాడుక నీరు, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక దోమలు, ఈగల బెడద అధికంగా ఉందని డిప్యూటీ వార్డెన్ తెలియజేశారు. వంట గ్యాస్ సకాలంలో సరఫరా కావడం లేదని, తాగునీటి సమస్య ఉందని, ఆర్‌వో ప్లాంట్ మరమ్మతులకు గురైందని కూడా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు.
రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు చైర్మన్‌కు తెలిపారు. ఈ సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్యను కూడా ఉపాధ్యాయులు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా, మరుగుదొడ్లను పరిశీలించి పారిశుధ్యం సక్రమంగా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రపాలెం ఎంపీటీసీ సభ్యుడు మేడిబోయిన చక్రరావుతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.




