బెల్టుషాపుల నియంత్రణ నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ, NewzFast Telugu (బూర్గంపహాడ్, ఖమ్మం జిల్లా): బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో మద్యం విక్రయాలు జరపకూడదని, బెల్టుషాపులను నియంత్రించాలని సర్పంచ్ బానోత్ సరోజ ఆధ్వర్యంలోని పాలకవర్గం బుధవారం తీర్మానం చేసింది.
పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తహసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎస్ఐ మేడా ప్రసాద్, ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు పాల్గొన్నారు. మద్యం సేవించి యువత ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని వారు సూచించారు.
మద్యపానం, బెల్టుషాపుల నియంత్రణకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం మంచిదని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే గ్రామంలో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్, పాలకవర్గానికి సూచించారు.
మద్యం విక్రయాల నియంత్రణతో పాటు బెల్టుషాపులు లేని పంచాయతీగా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీపీవో బుల్లారావు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

