జడ్చర్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, NewzFast Telugu (జడ్చర్ల): జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుసూదన్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో ప్రధానోపాధ్యాయుడు మరుతి నారాయణతో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. గైర్హాజరైన వారిలో ప్రధానోపాధ్యాయుడు మరుతి నారాయణ, ఉపాధ్యాయులు సుశీల, శ్రీనివాస్ గౌడ్, శంకర్, మంజుల, రాఘవేంద్ర, చామంతి ఉన్నారు.
వీరంతా అమరావతికి విద్యా పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. దీనిపై అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని (డీఈఓ) ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, సమయపాలన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.




