భారత్ ఫ్యూచర్ సిటీ, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల సరసన నాలుగో నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే లక్ష్య సాధనలో ఈ నగరం కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), హైటెక్స్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’ రెండో ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రజాస్వామ్య సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు సుమారు 70 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు.
భారత్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం హైటెక్స్‌లో ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’ అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను అధిగమించేలా, నెట్-జీరో లక్ష్యంతో, పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.
దీన్ని కేవలం ఒక పారిశ్రామిక ప్రాంతంగా కాకుండా, ప్రజలు నివసించేందుకు, పనిచేసేందుకు, చదువుకునేందుకు, పరిశోధనలు మరియు నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. నగర నిర్మాణంలో వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, సౌర విద్యుత్, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక్కడ ఏఐ (AI), లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), డేటా సెంటర్లు, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్, హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, మారుబెనీ, సెమ్‌కార్ప్, ఎన్టీటీ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
దేశ పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి కొత్త నమూనాగా నిలవబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. భూమి కేటాయింపుల నుంచి మౌలిక సదుపాయాలు, అనుమతుల వరకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ చర్చాగోష్ఠిలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సీఈవో విజయ్ మహాజన్, సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్ టికేందర్ సింగ్ పవార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్, చరిత్రకారులు సజ్జద్ షాహిద్, మాజీ ఎంపీ దివ్యా స్పందన తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ రాత్రికి హైదరాబాద్ రానున్నారు. రేపు గిగ్ వర్కర్లతో సమావేశం కానుండటంతో ఆయన పర్యటన రాష్ట్రంలో ఆసక్తిగా మారింది.




