మంచు మనోజ్ నమస్తే వరల్డ్, NewzFast Telugu (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్): సినీ గ్లామర్, రాజకీయ వారసత్వం కలగలిపిన మంచు మనోజ్, భూమా మౌనిక జంట ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వైవిధ్యమైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మనోజ్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి సంయుక్తంగా పారిశ్రామికవేత్తలుగా కొత్త అవతారం ఎత్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపిన వీరు ‘నమస్తే వరల్డ్’ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.36 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా పలువురు యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు.
సాగర నగరం విశాఖలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సీఐఐ సమ్మిట్‌లో మంచు మనోజ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరిశ్రమల సమాఖ్య, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో పలువురు పారిశ్రామిక దిగ్గజాలు కొత్త యూనిట్లు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఈ జాబితాలో మనోజ్ దంపతుల నమస్తే వరల్డ్ కూడా ఉంది.
సినిమాల్లో బిజీగా ఉన్న మనోజ్ అనూహ్యంగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన తండ్రి మోహన్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం వరకు మనోజ్ వాటి బాధ్యతలు చూసేవారు. అయితే కుటుంబంలో తలెత్తిన సమస్యల వల్ల ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా నమస్తే వరల్డ్ ద్వారా సుమారు రూ.36.24 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మనోజ్, మౌనిక దంపతులు ముందుకొచ్చారు. ఈ సంస్థకు భూమా మౌనిక రెడ్డి వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
మంచు మనోజ్ సహ-వ్యవస్థాపకుడిగా ఉంటారని చెబుతున్నారు.
ఈ యూనిట్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లల ఆటబొమ్మలు, వివిధ రకాల హస్తకళా ఉత్పత్తులను తయారు చేయనున్నారు. స్థానిక హస్తకళాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారి నైపుణ్యాలను ఆధునిక పారిశ్రామిక సమూహాలతో అనుసంధానించడం ముఖ్య ఉద్దేశమని దంపతులు ప్రకటించారు.
ఓర్వకల్లులో పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువత, మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
భూమా కుటుంబం రాయలసీమ రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్న కుటుంబం. మౌనిక రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ఆమె పారిశ్రామికవేత్తగా సొంత ప్రాంత అభివృద్ధికి తోడ్పడేలా పరిశ్రమ స్థాపించడం విశేషంగా మారింది.
సామాజిక అంశాలపై ఎప్పుడూ చురుగ్గా స్పందించే మనోజ్ వ్యాపార రంగంలోకి రావడం పట్ల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినీ రంగంలో మనోజ్ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. ‘భైరవం’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘మిరాయ్’ చిత్రంలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రతో మెప్పించారు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మలాదేవితో కలిసి మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్న మనోజ్, ఇప్పుడు పారిశ్రామిక రంగంలోనూ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.




