సింగూరు మంజీరా జలాలు, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగర దాహార్తి తీరుస్తున్న కీలకమైన సింగూరు, మంజీరా జలాలు త్వరలోనే నిలిచిపోనున్నాయి. ప్రస్తుతమున్న జలాలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి.
వర్షాలు కురవక, వరద రాక సింగూరు జలాశయం నీటిమట్టం పెరగలేదు. నవంబరు నెలలో వర్షాలు వస్తాయనే ఆశలు కూడా సన్నగిల్లాయి.
దీంతో సింగూరు జలాశయం పూర్తిగా డెడ్ స్టోరేజ్‌కి చేరనుంది. డిసెంబర్ నెలాఖరుకు నగరానికి నీటి సరఫరా ఆగనుందని అంచనా.
అదే జరిగితే హైదరాబాద్ మహా నగరంలోని 14 లక్షల కనెక్షన్లలో 3 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి కటకట తప్పదు. ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లిపై నీటి సమస్య తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించేందుకు వాటర్‌బోర్డు ప్రయత్నిస్తోంది. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయంతో గతేడాది సింగూరు జలాశయంలో సుమారు 30 టీఎంసీల నీటిని కిందకు వదిలారు.
డ్యామ్, గేట్లను నిపుణులు పరిశీలించారు.
సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 523 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.320 మీటర్ల వద్ద నీరు ఉంది. నీటిమట్టం 516 మీటర్లకు చేరినప్పటి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు పంపుహౌజ్‌కు నిలిచిపోయాయి.
రెండు నెలలుగా అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి జలాలు తీసుకొస్తున్నారు.
510 మీటర్లకు చేరగానే సుమారు 300 మిలియన్ లీటర్ల సరఫరా నిలిచిపోనుంది. మంజీరా ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, యూసుఫ్‌గూడ, బోరబండ, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, చందానగర్, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, నిజాంపేట్ తదితర ప్రాంతాలకు జలాలు అందుతున్నాయి.
ఆ జలాలు నిలిచిపోతే ఈ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.
నగరానికి జలాలు నిలిచిపోయే అవకాశాలుండడంతో వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సైనిక్‌పురి వరకు కృష్ణా జలాలు అందిస్తుండగా, ఆ తర్వాత ప్రాంతాలకు గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి.
సింగూరు, మంజీరా సరఫరా జరిగే ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించేందుకు వాల్వ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఖాజాగూడ జంక్షన్ వద్ద కృష్ణా, గోదావరి పైపులైన్లను అనుసంధానం చేశారు. తట్టిఖానా రిజర్వాయర్‌కు ప్రశాసన్‌నగర్ నుంచి కృష్ణా జలాలు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఏ జలవనరైనా నిలిచిపోతే మరో వనరు నుంచి నీటిని సరఫరా చేసేలా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
సాధారణంగా అక్టోబరు నెలలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేసుకున్నారు. అయితే అంచనాలు తలకిందులయ్యాయి.
సింగూరు ఎగువన వర్షాలు కురవలేదు, వరదలు రాలేదు. ఎల్‌నినో నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
దీంతో నవంబరులోనూ వర్షాలపై ఆశలు ఆవిరవుతున్నాయి.
సింగూరు, మంజీరా జలాలను రోజూ నాలుగు ఫేజ్‌ల్లో సుమారు 300 మిలియన్ లీటర్ల వరకు నగరానికి తరలిస్తున్నారు. ఏడు నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ నీరు అందుతోంది.
సరఫరా నిలిచిపోతే శేరిలింగంపల్లి, పటాన్చెరు, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని 3 లక్షల నీటి కనెక్షన్లపై ప్రభావం పడనుంది. వీటిలో శేరిలింగంపల్లిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
సింగూరు ఫేజ్-3, ఫేజ్-4 నిలిచిపోతే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ, చందానగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలతో పాటు టోలిచౌకి, గోల్కొండ పరిసరాల్లో నీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి.




