మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి, NewzFast Telugu (ప్రపంచవ్యాప్తంగా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ నుంచి భారీ షాక్ తగిలింది. మైక్రోసాఫ్ట్ 365, ఔట్లుక్, టీమ్స్ సహా పలు కీలక అప్లికేషన్లు దాదాపు ఏడు గంటలకు పైగా నిలిచిపోయాయి.
ఈ సాంకేతిక అంతరాయం కారణంగా వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్ల ద్వారా సేవలు అందిస్తున్న ప్రముఖ ఏఐ సంస్థలు ఓపెన్ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) ఏఐ సర్వీసులు కూడా ఈ సర్వర్ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. డౌన్టెక్ డిటెక్టర్ నివేదికల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఔట్లుక్ సేవల అంతరాయంపై 1,38,058 ఫిర్యాదులు అందగా, ఉదయం 4.30 గంటలకల్లా ఆ సంఖ్య సుమారు 34,490కి తగ్గింది.
ఈ పరిణామాలపై స్పందించిన మైక్రోసాఫ్ట్, దెబ్బతిన్న సర్వర్లను పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమించామని, వినియోగదారులు మళ్లీ కనెక్ట్ కావడంతో సేవలు క్రమంగా కోలుకుంటున్నాయని తెలిపింది. ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఓవర్‌హెడ్ కావడమే ఈ అంతరాయానికి ప్రధాన కారణమని కంపెనీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.
దీని వల్ల సర్వర్లు వినియోగదారుల అభ్యర్థనలను ప్రాసెస్ చేయలేకపోయాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక కాన్ఫిగరేషన్ మార్పును సిద్ధం చేసి, కొన్ని సర్వర్లపై పరీక్షించిన తర్వాత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఇటీవల నెట్వర్క్ కాన్ఫిగరేషన్‌లో చేసిన మార్పులను రివర్స్ చేసి పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ఈ అంతరాయం కారణంగా ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెబ్, డెస్క్‌టాప్, మొబైల్ యాప్‌ల ద్వారా ఔట్లుక్ మెయిల్స్‌ను యాక్సెస్ చేయడం వినియోగదారులకు కష్టతరంగా మారింది.
మైక్రోసాఫ్ట్ కోపైలట్, టీమ్స్‌లోని క్యాలెండర్లు మరియు మీటింగ్ షెడ్యూలింగ్ ఫీచర్లు కూడా ప్రభావితమయ్యాయి.
వీటితో పాటు ప్లానర్, టూ డు, డిఫెండర్, పవర్ బీఐ, షేర్‌పాయింట్ ఆన్లైన్, విండోస్ 365 వంటి అనేక సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సొంత యాప్‌లతో పాటు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆధారపడిన మూడవ పార్టీ సేవలు కూడా దెబ్బతిన్నాయి.
కొత్త కనెక్షన్లను నిలిపివేసేలా మైక్రోసాఫ్ట్ కనెక్టర్లలో సమస్య తలెత్తిందని ఓపెన్ఏఐ పేర్కొంది.
ఈ గ్లోబల్ టెక్ అంతరాయం కారణంగా కొన్ని వ్యాపార సంస్థల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లింది. కొన్ని వారాల క్రితం అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో తలెత్తిన సమస్యల తర్వాత, మైక్రోసాఫ్ట్‌కు సంబంధించి మళ్లీ ఇలాంటి పెద్ద స్థాయి అంతరాయం ఏర్పడటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




