టిమ్స్ ఆసుపత్రులు, NewzFast Telugu (హైదరాబాద్): వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉస్మానియా నూతన ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చూడాలన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణ పనులు, పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్స కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మూడేళ్లలోనే 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు.
సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం పాటించాలని సూచించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా చూడాలన్నారు.
ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సీఎం సూచించారు.
టిమ్స్ పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని, హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను వేరే సిబ్బంది చూస్తే వైద్యులు పూర్తిగా వైద్య సేవలపై దృష్టి సారించగలరని అన్నారు.
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో బెడ్స్ లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్‌నగర్ టిమ్స్‌ను వినియోగించుకోవాలన్నారు.
వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని సూచించారు.
టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, ఏఐతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు అధికారులు వివరించారు. ఔట్ పేషెంట్ల సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు, ఇన్ పేషెంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరిగినట్లు తెలిపారు.
ఆరోగ్య రంగానికి బడ్జెట్లో సగటున 3.9 శాతం నుంచి 4.8 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రస్తావించారు.
మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేసినట్లు సీఎం తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.




