ఆంధ్రప్రదేశ్ రెండో డీఎస్సీ నోటిఫికేషన్ 2026, NewzFast Telugu: రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యా శాఖ రెండో డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేసింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా వేలాది పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు మిగిలిన, కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ రెండో నోటిఫికేషన్ తీసుకువచ్చారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సాధారణ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 1,205 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
దివ్యాంగుల ప్రత్యేక విద్య విభాగంలో 350 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే విద్యా శాఖ పరిధిలోని వివిధ సంక్షేమ సొసైటీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ కేటగిరీల్లో 260 పోస్టులను భర్తీ చేస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి 18 నుండి 44 ఏళ్ల వరకు నిర్ణయించగా, రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియను కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోరుకు 20 శాతం, రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ వర్తింపజేస్తారు.
పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఇప్పటికే పోర్టల్లో అందుబాటులో ఉండటంతో అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించారు. వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయడంపై అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


