హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ దాడులు, NewzFast Telugu (హైదరాబాద్): బ్రాండెడ్ ఫుడ్ సెంటర్లలో శుచి, శుభ్రత ఉంటుందని భావించి పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ తింటున్న హైదరాబాద్ వినియోగదారులకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE) అధికారుల తనిఖీలు షాక్ ఇచ్చాయి.
నగరంలోని క్యూర్ (CURE) రీజియన్ పరిధిలో ఉన్న ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సంస్థలు కేఎఫ్‌సీ, డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లపై పోలీసు సిబ్బందితో కూడిన 13 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 26 కేంద్రాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో పలు బ్రాంచీలు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించలేదని అధికారులు గుర్తించారు. వంటగదులు, స్టోర్ రూమ్‌లలో తీవ్రమైన దుర్వాసన, బొద్దింకలు, ఈగల బెడదతో పాటు ఎలుకల విసర్జనలు, గడువు తీరిన ఆహార పదార్థాలు కనిపించాయి.
ముఖ్యంగా, ఒకసారి వాడిన వంట నూనెను ఫిల్టర్ చేసి మళ్లీ వినియోగించేందుకు అనధికారికంగా మెగ్నీషియం సిలికేట్ కలుపుతున్నట్లు గుర్తించి 52 కిలోల కెమికల్‌ను సీజ్ చేశారు.
తీవ్ర లోపాలున్న 9 అవుట్‌లెట్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసి మూసివేశారు. ఇందులో మదీనాగూడ, సింధీ కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, శిల్పకళా వేదిక, ఇనార్బిట్ మాల్ కేఎఫ్‌సీలు; శరత్ సిటీ మాల్, ఇనార్బిట్ మాల్ డొమినోస్ అవుట్‌లెట్లు ఉన్నాయి.
అదనంగా 5 బ్రాంచీలకు షోకాజ్ నోటీసులు, 8 బ్రాంచీలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
లైసెన్సులు రద్దయిన 9 అవుట్‌లెట్ల వివరాలను స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఆ బ్రాంచీలను తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని (Delist) ఆదేశించనున్నారు.




