హైదరాబాద్ సీపీ బదిలీ, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం సీపీ పదవి నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో మహేశ్ మురళీధర్ భగవత్‌ను నూతన కమిషనర్‌గా నియమించింది.
ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ బాధ్యతలు నిర్వర్తించిన మహేశ్ భగవత్ స్థానంలో, వెయిటింగ్‌లో ఉన్న ఏడీజీ అకున్ సభర్వాల్‌ను శాంతిభద్రతల డీజీగా నియమించారు. ఈ బదిలీలతో పాటు మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ డీజీగా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీటీమ్స్, భరోసా విభాగం డీజీగా నియమించారు.
హోంగార్డ్స్, ఎస్‌పీఎఫ్ డీజీగా ఉన్న స్వాతి లక్రాకు జైళ్ల శాఖ బాధ్యతలు అప్పగించారు.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారుసిన్హాను పూర్తిస్థాయిలో నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఎండీగా డాక్టర్ అనిల్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
సివిల్ సప్లైస్ కొత్త కమిషనర్‌గా వై నాగిరెడ్డి నియమితులయ్యారు.
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ విభాగం డీజీగా విక్రమ్‌సింగ్‌మాన్‌కు బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ-టీఎంఏఆర్‌ఎస్) మొదటి డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు.
రైల్వేస్ ఐజీగా కే రమేశ్‌నాయుడు, జాయింట్ డైరెక్టర్ (రోడ్ సేఫ్టీ) మరియు (ట్రాఫిక్)గా డీ జోయల్ డేవిస్ నియమితులయ్యారు.
ఈ బదిలీల్లో కొత్త పోస్టింగులతో పాటు పలు కీలక విభాగాల అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. సౌమ్య మిశ్రాకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాలు, చారుసిన్హాకు సీఐడీ, వీసీ సజ్జనార్‌కు ఎస్‌పీఎఫ్, విక్రమ్‌సింగ్‌మాన్‌కు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారు.
ట్రాఫిక్ నియంత్రణ, రైల్వే భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ విభాగాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోంది.




