భారత్ సమ్మిట్ 2026, NewzFast Telugu (హైదరాబాద్): ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించే వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు ఈ అంశాలపై చర్చించడం ద్వారా పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్-2026’ స్వాగత కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఏఐ, వాతావరణ మార్పులపై సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయని ఆయన ప్రకటించారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఆలోచనల స్ఫూర్తితో, సల్మాన్ ఖుర్షీద్ మార్గదర్శకత్వంలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్‌ను రెండో ఏడాదీ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఇండియా అండ్ ది వరల్డ్’ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారని, అదే రోజు ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్’ను ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.




