ప్రధాని మోదీ మీడియా మార్పులు, NewzFast Telugu (న్యూఢిల్లీ): మీడియా రంగంలో గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన సమూల మార్పులకు తానే ప్రత్యక్ష సాక్షినని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో మీడియాలో వార్తలు రావాలంటే ప్రెస్ నోట్లు పంపేవారమని, ఇప్పుడు వార్తలన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లోనే తెలిసిపోతున్నాయని ఆయన తెలిపారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘దివాలీ మిలన్’ కార్యక్రమంలో ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిస్టులతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
బీజేపీలో చేరిన కొత్తలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగితే తానే కుర్చీలు వేసేవాడినని మోదీ చెప్పారు. 1990ల్లో పార్టీ నిర్వహించిన రెండు ప్రధాన యాత్రల సమయంలో మీడియాతో సమన్వయం చేసే బాధ్యతను తానే నిర్వహించానని ఆయన తెలిపారు. ఆ కాలంలో మీడియా సంస్థలకు వార్తలు పంపేందుకు ఫ్యాక్స్ యంత్రాల కోసం వెదికేవారమని, ఇప్పుడు ఓబీ వ్యాన్లు కూడా పోయాయని, చేతిలోని స్మార్ట్ ఫోనే ఓబీ వ్యాన్‌గా మారిపోయిందని వివరించారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా వార్తా విశ్లేషకులే ఉంటున్నారని, ఎవరికి వారు సొంత చానల్, పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తున్నారని మోదీ అన్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో తనకు మొదటి నుంచి పరిచయం ఉన్న పాత జర్నలిస్టు మిత్రులు కొంతమందే ఉన్నారని, చాలామంది కొత్తవాళ్లు ఈ రంగంలోకి వచ్చారని చెప్పారు.
వర్కింగ్ జర్నలిస్టుల విధి నిర్వహణ కత్తిమీద సామని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని చూస్తే, ఫీల్డ్ జర్నలిస్టులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదాలకు ఎదురెళ్తారని అన్నారు.
దేశంలోని కుటుంబాలు పండుగల సమయంలో సంతోషంగా గడుపుతుంటే, జర్నలిస్టులు బ్రేకింగ్ న్యూస్ కోసం కష్టపడుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు.
2001లో తనను గుజరాత్ ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ విషయం పార్టీలోని ఒకరిద్దరు పెద్దలకు మాత్రమే తెలుసని, అయితే ఒకరోజు కొందరు జర్నలిస్టులు తన గదిలోకి వచ్చి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
వారు అభిమానంగా స్వీట్లు అడిగారని, ఎందుకని ప్రశ్నిస్తే సీఎంగా ఎంపికైనందుకని చెప్పారని వివరించారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పినా వారు నమ్మలేదని, విషయం బయటకు పొక్కడంతో అందరికీ స్వీట్లు పంచినట్లు మోదీ తెలిపారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడాకు ప్రధాని మోదీ గురువారం దీపావళి, గుజరాత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తన గురించి పిట్రోడా సానుకూల వ్యాఖ్యలు చేయడంతో మోదీ ఈ శుభాకాంక్షలతో స్పందించారు.




