11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు, NewzFast Telugu (తెలంగాణ): పదో తరగతి పూర్తయిన తర్వాత 12వ తరగతిలోనే బోర్డు పరీక్ష ఉండేలా, మధ్యలో ఉన్న 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని గుర్తించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
వచ్చే విద్యా సంవత్సరం 2027-28 నుంచి సీనియర్ సెకండరీ విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో 10వ తరగతి తర్వాత 11వ తరగతి బోధన కొనసాగుతుంది.
అయితే వార్షిక పరీక్షలను బోర్డు పరీక్షలుగా పరిగణించరు; 8, 9వ తరగతి పరీక్షల మాదిరిగానే వీటిని నిర్వహిస్తారు. బోర్డు పరీక్ష కేవలం 12వ తరగతిలో మాత్రమే ఉంటుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి తర్వాత చదువు కొనసాగించని విద్యార్థుల సంఖ్య ఏటా 40-45 వేల మంది వరకు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఐదో తరగతి పూర్తయిన వారిలో 99.1 శాతం మంది ఆరవ తరగతిలో చేరుతుండగా, 10వ తరగతి తర్వాత ఇంటర్ ఫస్టియర్లో చేరే విద్యార్థుల శాతం 88గా ఉంది.
ఈ డ్రాపౌట్లలో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారని, వారిలో 70 శాతం మంది బాలికలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పది తర్వాత మరో విద్యాసంస్థలో ప్రవేశం పొందాల్సి రావడం, అందుబాటులో జూనియర్ కాలేజీలు లేకపోవడం డ్రాపౌట్లకు ప్రధాన కారణాలని అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాల్లో 12వ తరగతి వరకు బోధన ఉండటంతో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉంటోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రేటు 12 శాతంగా ఉందని విద్యా శాఖ పేర్కొంది.
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికలు కనీసం 12వ తరగతి వరకు చదివేందుకు అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్లలోపు జరుగుతున్న బాల్య వివాహాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అధికారులు పేర్కొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎలా వినియోగించాలన్న దానిపై అధికారులు కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. వీటిలో 411 కాలేజీలు ఉన్నత పాఠశాలలకు సమీపంలో ఉండటంతో వాటిని 9-12 తరగతుల బోధనకు ఉపయోగించాలని భావిస్తున్నారు.
అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రైవేటు ఉన్నత పాఠశాలలు 11, 12వ తరగతుల కోసం, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 9, 10వ తరగతుల కోసం అనుమతికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 ప్రైవేటు జూనియర్ కాలేజీలు 9-12 వరకు బోధన అందించాల్సి ఉంటుంది.
కొత్త విద్యావిధానానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.




