మేకిన్ ఇండియా, NewzFast Telugu (న్యూఢిల్లీ): మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం అమలులో చిత్తశుద్ధి లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రతిదానికీ చైనాపై ఆధారపడటం కొనసాగుతోందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
దేశీయ పారిశ్రామిక స్వావలంబన లక్ష్యాలపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 112 బిలియన్ డాలర్లకు చేరింది. ఏ ఒక్క దేశంతోనూ భారత్‌కు ఇంత భారీ వాణిజ్య లోటు లేదు.
ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక యంత్రాలు, రసాయనాలు అనే మూడు రంగాలే చైనా నుంచి వచ్చే మొత్తం దిగుమతుల్లో దాదాపు 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. కొన్ని కీలక ఉత్పత్తుల దిగుమతుల్లో చైనా వాటా 80 శాతానికి పైగా ఉంది.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ కొంత పురోగతి సాధించినప్పటికీ, చిప్‌లు, లిథియం, బ్యాటరీలు, సౌర విద్యుత్ సెల్స్ వంటి కీలక విడిభాగాల కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. 2025-26లో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల్లో చైనా వాటా 46.3 బిలియన్ డాలర్లు (44.2 శాతం)గా ఉంది. హాంకాంగ్ నుంచి మరో 11.2 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి.
విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు 2025లో కేంద్రం రూ.22,900 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పథకాన్ని ప్రారంభించింది.
గనులు, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్రాల విషయంలోనూ చైనా కీలక సరఫరాదారుగా ఉంది. 2025-26లో భారత్ చైనా నుంచి 29.4 బిలియన్ డాలర్ల విలువైన పారిశ్రామిక యంత్రాలను దిగుమతి చేసుకుంది. అల్లిక, కుట్టు యంత్రాల దిగుమతుల్లో చైనా వాటా 87.7 శాతంగా ఉంది.
వ్యవసాయ యంత్రాల్లోనూ చైనా వాటా 76 శాతం వరకు ఉంది. ఇటీవల సొరంగాల తవ్వకానికి ఉపయోగించే యంత్రాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
దీంతో ఈ యంత్రాలను తయారుచేస్తున్న జర్మనీ సంస్థతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు భారత్ ప్రయత్నించింది.
ఔషధాల తయారీలోనూ చైనా ముడిసరుకులపై ఆధారపడటం స్పష్టంగా కనిపిస్తోంది. 2025-26లో భారత్ దిగుమతి చేసుకున్న పెనిసిలిన్లో 81 శాతం, రిఫాంపిసిన్లో 86 శాతం, క్లోరాంఫెనికాల్లో 95 శాతం, ఎరిత్రోమైసిన్లో 99 శాతం చైనా నుంచే వచ్చాయి. ఎరువులు, పురుగు మందుల తయారీకి అవసరమైన రసాయనాల విషయంలోనూ దిగుమతులపై ఆధారపడుతోంది. 2025-26లో 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకోగా, అందులో చైనా వాటా 19.6 శాతంగా ఉంది.
దేశంలో తయారీ రంగంలో స్వావలంబన సాధించాలంటే కేవలం సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలతో సరిపోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.




