జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్, NewzFast Telugu (మేడ్చల్): మేడ్చల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి నేతృత్వంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని కోరుతూ మంత్రి శ్రీధర్‌బాబును గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు.
డంపింగ్ యార్డ్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాంకీ సంస్థ వినియోగించకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోందని మల్లారెడ్డి వివరించారు. పేరుకుపోతున్న చెత్తను ఇష్టం వచ్చినట్లు కాల్చుతున్నారని, దుర్వాసన, విషపూరిత పొగతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో రాంకీ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన రాకుండా అనేక చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
చెత్తను ఎప్పటికప్పుడు వినియోగించేలా రూ. 1500 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేయించారని మల్లారెడ్డి గుర్తుచేశారు.
డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 200 కోట్లతో శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేశామని, చెత్తపై క్యాపింగ్ చేసేందుకు రూ. 150 కోట్లు కేటాయించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూశామని వివరించారు. నగరంలో నాలుగు ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
జవహర్‌నగర్, నాగారం డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కావ్య, దమ్మాయిగూడ మాజీ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, వాణి శ్రీనివాస్‌రెడ్డి, డంపింగ్ యార్డ్ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.




