పత్తి పంట, NewzFast Telugu (కర్నూలు జిల్లా, మంత్రాలయం): ఈ ఏడాది పత్తి రైతులకు అప్పులే మిగిలాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక మొలక దశ నుంచే మొక్కలు ఎండిపోయాయి.
అప్పుడప్పుడూ అరకొరగా కురిసిన వర్షానికి పంట పెరగక మధ్య దశలోనే పూత, పిందె, కాయ వచ్చి పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. బోర్లు, నదితీరం, బావుల కింద సాగుచేసిన పంటను గులాబిరంగు పురుగు ఆశించి నమిలేసింది.
మొగ్గ, పూత, పిందె, కాయ రాలి తీవ్ర నష్టం జరిగింది. ఎన్ని మందులు వాడినా అదుపులోకి రాకపోవడంతో, రైతులు మూగజీవాలకు పత్తి పంటను గ్రాసంగా వదిలేశారు.
మంత్రాలయం మండలంలోని చెట్నహల్లి, సూగూరు, మాధవరం, వగరూరు, తిమ్మాపురం తదితర గ్రామాల రైతులు సాగుచేసిన పత్తి పంటను పశువులకు మేతగా వదిలేశారు. వందల ఎకరాల్లోని పంటలను దున్నేశారు.
లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్తి సాగుచేస్తే పెట్టుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో కొందరు పంటను పీకేయగా, మరికొందరు దున్నేశారు.
చెట్నహళ్ళి గ్రామానికి చెందిన కౌలు రైతు రామలింగ మాట్లాడుతూ, మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశామని చెప్పారు. మూడు ఎకరాలకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేయగా, కేవలం రూ.1.60 లక్షల పంట మాత్రమే వచ్చిందని, ఏడాది మొత్తం కష్టం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.




