మణిరత్నం ఇంజి వెల్లం, NewzFast Telugu: ప్రేమకథలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరోసారి తన మార్క్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మౌన రాగం, సఖి వంటి క్లాసిక్ లవ్ స్టోరీలను అందించిన ఆయన, ఈసారి విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఇంజి వెల్లం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి చిన్న పిల్లలతో కనిపించడం విశేషంగా నిలిచింది.
ప్రేమ జంటగా కాకుండా తల్లిదండ్రులుగా కనిపించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
మణిరత్నం సినిమాల్లో భిన్నమైన రిలేషన్షిప్ డైనమిక్స్ కనిపిస్తుంటాయి. ఈసారి కుటుంబ నేపథ్యంతో పాటు భార్యాభర్తల మధ్య సున్నితమైన భావోద్వేగాలను ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ ఇద్దరు పిల్లలు ఎవరనే దానిపై నెటిజన్లలో జోరుగా చర్చ సాగుతోంది.
గతంలో మణిరత్నం తీసిన బొంబాయి చిత్రంలో అరవింద్ స్వామి, మధుబాల కవల పిల్లలకు తల్లిదండ్రులుగా కనిపించారు. అదే తరహాలో ఇంజి వెల్లంలో కూడా కవల పిల్లల తల్లిదండ్రులుగా నటిస్తున్నారా, లేక కథలో ఏదైనా కీలక మలుపు ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ బొంబాయి తరహాలోనే ఇది ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అయితే, ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఎమోషనల్ బాండింగ్‌ను హైలైట్ చేయడంలో మణిరత్నం మాస్టర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే పక్కా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది.
విజయ్ సేతుపతి ఇంటెన్సిటీ, సాయి పల్లవి అభినయం కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ కనిపిస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీలో వీరి కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పోస్టర్ సూచిస్తోంది.
మణిరత్నం గత చిత్రం థగ్ లైఫ్ భారీ అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ చిత్రం పాత సినిమా ఫార్మాట్లో కనిపించడం కలిసి రాలేదని విశ్లేషణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇంజి వెల్లంతో మణిరత్నం తిరిగి పుంజుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.




