సహకార సంఘాల ఎన్నికలు, NewzFast Telugu (కర్నూలు, ఆంధ్రప్రదేశ్): స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరగనుండటంతో, ఆ సంఘాల్లో సభ్యులైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో 43 సంఘాల్లో 76,066 మంది, నంద్యాల జిల్లాలో 56 సంఘాల్లో 1.20 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున సభ్యులైన రైతులతో ఈకేవైసీ చేయించేందుకు సంబంధిత సంఘాల సీఈవోలు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా సభ్యులను చేర్చే విషయంలో గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు.
ఒక్కో సంఘం పరిధిలో ఏటా రూ.కోటి వరకు పంట రుణాలు, రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలు అందుతుండటంతో పాలకవర్గాలకు ప్రాధాన్యత ఉంది. చైర్మన్లు, డైరెక్టర్ పదవులపై గ్రామాల్లోని స్థానిక నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో సహకార సంఘాలకు చివరిసారిగా 2013 జనవరిలో ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాల గడువు 2018 జనవరిలో ముగియగా, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడాదిన్నర పాటు ఆ పాలకవర్గాలనే కొనసాగించింది.
ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలపై శ్రద్ధ చూపలేదు, ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యేల సిఫారసుతో నామినేట్ అయిన త్రిసభ్య కమిటీలనే కొనసాగించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ గత శనివారం జిల్లా యంత్రాంగానికి మెమో జారీ చేశారు. రైతులు ఎన్నుకునే పాలకవర్గం అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారు.
జిల్లా సహకార శాఖ అధికారి షర్మిల మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో 76,066 మంది సభ్యులకు గాను ఇప్పటివరకు 65,437 మంది రైతులతో ఈకేవైసీ పూర్తయిందని తెలిపారు. కొత్తగా సభ్యులు కావాలనుకునే వారు రూ.300 రుసుం చెల్లించి చేరవచ్చని ఆమె వెల్లడించారు.




