పులివెందుల మున్సిపల్ ఎన్నికలు టీడీపీ ఫిర్యాదు, NewzFast Telugu (పులివెందుల): పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు సాగించిన హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాని కలిసి ఫిర్యాదు చేశారు.
పులివెందులలో మాజీ సీఎం జగన్ వర్గీయులు సృష్టించిన విధ్వంసం, విజయవాడ లయోలా కాలేజీలోని 5వ నంబరు పోలింగ్ బూతులో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అనుచరులతో చొరబడి హల్చల్ చేసిన ఘటనలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఈ ఫిర్యాదులో ఎమ్మెల్సీ వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్, టీడీపీ నేత గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఓటమి భయంతోనే కొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారని ఆరోపించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పులివెందులలో జగన్ స్వేచ్ఛగా ర్యాలీ, ధర్నా చేశారని, ఇంత జరిగాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం విడ్డూరమని అన్నారు. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదన్న వైసీపీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
పంచాయతీ నిధుల దోపిడీపై నీలాయపాలెం విజయకుమార్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.9 వేల కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లాయని ఆరోపిస్తూ, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
